తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న హైబ్రీడ్ మహానాడు ఆశించిన స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోతోంది. సాంకేతికతను జోడించి డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైంది. పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజల నుండి కూడా స్పందన కరువవడంతో చాలా చోట్ల సభా ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి.
కృష్ణా జిల్లా మోపిదేవి సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పసుపు పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరచడానికి ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ స్క్రీన్ల ముందు కూర్చునే నాథుడే కరువయ్యారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆన్‌లైన్ ద్వారా లైవ్‌లో ముఖ్య ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మోపిదేవి సెంటర్‌లో ఇదే పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా స్థానిక నేతలు కార్యకర్తలు ఆ ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపించలేదు. వందలాదిగా వేసిన పసుపు రంగు కుర్చీలు జనాల్లేక బోసిపోయి కనిపించడం పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
గతంలో మహానాడు అంటే పండగ వాతావరణంలో వేలాది మందితో కిక్కిరిసిపోయేదని పాత తరం నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత హైబ్రీడ్ విధానం కార్యకర్తలను నేరుగా కనెక్ట్ చేయడంలో విఫలమైందని క్షేత్రస్థాయి పరిశీలనలో అర్థమవుతోంది. నాయకుల మధ్య సమన్వయ లోపం జన సమీకరణ చేయలేకపోవడం ఈ దారుణ పరిస్థితికి కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
