రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ చరిత్రలో ఒక నూతన శకాన్ని లిఖించింది. సరిగ్గా ఏడాది క్రితం తమ తొలి టైటిల్‌ను ముద్దాడిన ఆర్సీబీ ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో కెప్టెన్ రజత్ పటిదార్, లెజెండరీ కెప్టెన్లు ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మల సరసన నిలిచి, వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడవ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ హోరాహోరీ ఫైనల్లో టాస్ గెలిచిన పటిదార్..అనూహ్యంగా ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని కట్టడి చేసే బాధ్యతను బౌలర్లకు అప్పగించాడు. ఆర్సీబీ సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ మరియు జోష్ హేజిల్‌వుడ్ తమ అనుభవంతో జీటీ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. వాషింగ్టన్ సుందర్ వీరోచిత పోరాటం చేసినప్పటికీ గుజరాత్ కేవలం 155 పరుగులకే పరిమితమైంది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి కోహ్లి కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా కగిసో రబాడ వేసిన 155 కి.మీ వేగవంతమైన బంతిని అతను ఫ్లిక్ చేసిన తీరు అద్వితీయం. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ పట్టుదలతో కేవలం 25 బంతుల్లోనే తన కెరీర్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
మధ్యలో రషీద్ ఖాన్ వికెట్లు తీసి ఒత్తిడి పెంచినప్పటికీ కోహ్లి తన సహజసిద్ధమైన ‘ఛేజింగ్ మాస్టర్’ శైలిలో ఇన్నింగ్స్‌ను ఆఖరి వరకు నడిపించాడు. గత ఏడాది టైటిల్ గెలిచినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి..ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో ఆఖరి సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ‘ఈ సాలా కప్ నమ్దే’ అన్న నినాదాన్ని వరుసగా రెండోసారి నిజం చేస్తూ ఆర్సీబీ అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించింది.
