తమిళనాడు బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి తన రాజీనామా లేఖను సమర్పించారు అన్నామలై. రాజీనామా సమర్పించిన అనంతరం అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యారు.
అన్నామలై సరికొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తల నడుమ ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాను కొత్త పార్టీని పెట్టబోతున్నారనే ఊహాగానాలపై సోమవారం అన్నామలై స్పందిస్తూ.. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తానని చెప్పారు. పార్టీకి రాజీనామా చేసే ఆలోచనతోనే ఆయన జాతీయ రాజధాని ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్ నితిన్ నబీన్‌ను కలవబోతున్నారనే ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా.. దయచేసి వేచి ఉండండి. మనం రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడుదాం అని ఆయన సమాధానమిచ్చారు.
మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో అన్నామలై మద్దతుదారులు పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశారు. తమిళనాడును కాపాడటానికి…అన్నామలై మరొక అవతారం (కొత్త పార్టీ) ఎత్తాలని ఆ పోస్టర్లలో మద్దతుదారులు కోరారు. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నామలై ఒక పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతున్నారు.
ప్రస్తుత విద్యాసంవత్సరం నుండి 9వ తరగతి విద్యార్థులకు ‘త్రిభాషా విధానాన్ని’ అమలు చేయాలంటూ ఇటీవల సీబీఎస్‌ఈ (CBSE) జారీ చేసిన నోటిఫికేషన్‌ను అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఇలా బహిరంగంగా వ్యతిరేకించడంతో ఆయన సొంత పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారానికి మరింత బల చేకూరింది.
