- Advertisement -

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హత్య..

- Advertisement -

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ గోల్కొండలో తన భార్య పుట్టింటికి వెళ్లిన యువకుడిని, బావమరిది తన స్నేహితులతో కలిసి కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఛాంద్ మసూద్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూనే, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందాడు. గత ఏడాది జనవరిలో గోల్కొండకు చెందిన రుక్సారా బేగమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అయితే, తమ కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన ఈ వివాహంపై రుక్సారా సోదరుడు షేక్ జాహేద్ మొదటి నుంచీ కక్ష పెంచుకున్నాడు.

కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో, రుక్సారా ఇటీవల గోల్కొండలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మసూద్ తన భార్యను కలిసి మాట్లాడేందుకు అత్తగారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జాహేద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జాహేద్ తన బంధువులు, స్నేహితులైన జాబిర్, అమీర్, సుల్తాన్‌లతో కలిసి అత్తగారి ఇంట్లోకి చొరబడ్డాడు. మసూద్‌పై ఇనుప రాడ్లు, కత్తులతో విరుచుకుపడ్డారు. జాహేద్ తన బావ మసూద్ తలపై ఇనుప రాడ్‌తో కొట్టగా, జాబిర్ కత్తితో పొడిచాడు. అమీర్, సుల్తాన్‌లు కూడా దాడిలో పాల్గొన్నారు. మసూద్ కుటుంబ సభ్యులు చూస్తుండగానే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కేవలం 24 గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన జిమ్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ హత్యలో భార్య రుక్సారా పాత్రపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలే హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడొద్దని, కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. కక్షల వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, ఆరు నెలల పసిబిడ్డ తండ్రి ప్రేమకు దూరమయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -