అల్లుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేసింది ఓ భార్య. మొదట అనారోగ్యంతో మరణించాడని భావించిన ఘటనలో.. విచారణ అనంతరం ఇది హత్యగా తేల్చారు పోలీసులు.నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు.
అలివేలుకు తమ సొంత అల్లుడు ఆంజనేయులతో వివాహేతర సంబంధం ఏర్పడడంతో.. ఈ విషయం తెలుసుకుని తరచూ భార్యతో గొడవపడుతున్నాడు యాదయ్య.ఈ నెల 23న యాదయ్య ఇంట్లో మృతిచెందగా.. అనారోగ్యంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించింది భార్య.
అయితే అంత్యక్రియలకు ముందు శవానికి స్నానం చేయించి దుస్తులు మారుస్తుండగా శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి అన్న కుమారుడు పరశురాములు.పోలీసులు విచారణ చేపట్టి ప్రశ్నించగా.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతని మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకుంది భార్య అలివేలు.
అదే రోజు కూతురు, అల్లుడు కూడా ఇంటికి వచ్చి వెళ్లిన నేపథ్యంలో వారి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు కుటుంబ సభ్యులు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.
