కేంద్రం పార్లమెంట్ లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ – డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేలా నెంబర్ గేమ్ తో అధికార పక్షం సిద్దం అవుతోంది. అటు ఈ బిల్లును అడ్డుకుంటామని విపక్షం చెబుతోంది. ఈ సమయంలోనే 30 రోజులకు మించి జైల్లో ఉంటే పదవి కోల్పోయేలా ప్రతిపాదించిన బిల్లులో కీలక సవరణలు చేస్తూ జేపీసీ నిర్ణయం తీసుకుంది.
వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉంటే వారి పదవులను ఆటోమేటిక్గా రద్దు చేసేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చింది. అయితే, దీనిపై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ , సదరు నేతలను పదవుల నుండి పూర్తిగా తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. దానికి బదులుగా, వారు జైల్లో ఉన్న కాలానికి వారిని పదవుల నుండి కేవలం సస్పెండ్ చేసేలా బిల్లులో మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. గతంలో కేంద్రం ఈ బిల్లు ప్రతిపాదన సమయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు మంత్రులు, ముఖ్యమంత్రులు జైల్లో ఉంటూనే తమ పదవుల్లో కొనసాగడం వల్ల తలెత్తిన వివాదాలను నివారించేందుకు కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. కానీ, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల నేతలు తమ పదవులు కోల్పోయే ప్రమాదం ఉండకూడదని జేపీసీ అభిప్రాయపడింది.
దీంతో, అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న అత్యంత తీవ్రమైన క్రిమినల్ నేరాల్లో అరెస్టయినప్పుడు మాత్రమే ఈ పదవుల సస్పెన్షన్ నిబంధన వర్తించేలా మార్పులు చేయాలని సూచించింది. ఆరోపణలు రుజువు కాకుండానే వారు శాశ్వతంగా పదవులను కోల్పోకుండా చూసేందుకు కమిటీ మరో కీలక సిఫార్సు చేసింది. కోర్టులో వారు నిర్దోషులుగా విడుదలైనా, లేదా నిర్దిష్ట గడువులోగా ప్రాసిక్యూషన్ కేసును నిరూపించలేకపోయినా.. సదరు నేతలపై ఉన్న సస్పెన్షన్ వెంటనే రద్దయి, వారు తిరిగి తమ పదవులను చేపట్టేలా నిబంధన చేర్చాలని జేపీసీ స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ఈ సవరణలతో బిల్లును ప్రతిపాదించి సభ్యుల చర్చ తరువాత ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.
