- Advertisement -

హత్య, ఆత్మహత్య, పోలీసుల నిర్లక్ష్యం!

- Advertisement -

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడు కుడుముల హరికృష్ణ దారుణానికి ఒడిగట్టాడు. బావను హత్య చేసిన అనంతరం, అరెస్టు తప్పదని పరువు పోతుందన్న భయంతో తన భార్య ప్రణీత, ఇద్దరు చిన్నారులు మోహాంబిక (4), కౌషిక్ కృష్ణ (3)తో కలిసి మంగళవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్ వద్ద గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడటంతో రావూరివారికండ్రిగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై ఒంగోలు జీఆర్సీ సీఐ షేక్ మౌలాషరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బుచ్చిరెడ్డిపాలెం ఏఓ శ్రీహరి, నిందితుడు హరికృష్ణ సోదరి లావణ్యను వివాహం చేసుకున్నారు. తన సంపాదించిన ఆస్తిలో కొంత భాగాన్ని, భారీ నగదును హరికృష్ణకు శ్రీహరి ఇచ్చారు. అయితే, ఆర్థిక అవసరాల కోసం శ్రీహరి తిరిగి డబ్బులు అడగడంతో, ఆస్తి మొత్తం పోతుందనే ఆందోళనతో హరికృష్ణ బావను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. జూన్ 15న పెంచలకోన దైవదర్శనానికి తీసుకెళ్లి, మార్గమధ్యలో ముగ్గురు కలిసి శ్రీహరికి కుక్కలకు వేసే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశారు. ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించేందుకు యత్నించారు. మృతదేహంపై గాయాలు ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ విచారణలో అసలు విషయం బయటపడింది.

ఈ కేసును తొలుత ప్రమాదంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ కేసులో సీఐ, ఎస్సైలతో సహా 23 మంది పోలీసు సిబ్బందిపై ఒకేసారి బదిలీ వేటు పడింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు తప్పించుకు తిరిగే అవకాశం లభించిందని, ఇది తీవ్రమైన అంశమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

చనిపోయే ముందు హరికృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ఆస్తి కోసం కక్కుర్తిపడేవాడిని కాదని, తనపై నిందలు మోపారని ఆ వీడియోలో హరికృష్ణ వాపోయాడు. తనకున్న భూములు, ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ, తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆస్తి అంతా తన పిల్లలకే చెందాలని అతను కోరాడు. పోలీసుల విచారణకు ముందే ఈ వీడియోను బయట పెట్టాలని అతను పేర్కొన్నాడు. హరికృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, కేసులో పోలీసుల వైఫల్యం వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -