తిరుమల పుణ్యక్షేత్రంలో రోజురోజుకూ పవిత్రత లోపిస్తోందని, నిత్యం ఏదో ఒక అపచారం జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురికావడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ‘తిరుమల ప్రక్షాళన చేస్తాం’ అని చెప్పిన మాటలు ఇవేనా? నిత్యం కొండపై ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.
తాను కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడిని అని పదే పదే చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ కావడంపై ఏం సమాధానం చెప్తారు? అని నిలదీశారు. ఈ చోరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు తీవ్ర కుట్ర జరుగుతోందని భూమన ఆరోపించారు.
విగ్రహాన్ని చోరీ చేసిన దొంగను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఒక ‘పిచ్చివాడు’గా ముద్ర వేసి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది…కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తిరుమల భద్రతా వైఫల్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని, అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు.
