ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండి మిత్రులుగా ఉన్న ఇద్దరు ప్రముఖ నాయకులు ఇప్పుడు సొంత పార్టీని వదిలేసి ఇద్దరు వేర్వేరు పార్టీల్లో చేరడంతో బద్ధ శత్రువులుగా మారారు. మూడు రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. వారిద్దరే టీఆర్ఎస్ నాయకుడు, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి ఐటెం సాంగ్ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యలు చేయడంతో దీనికి ప్రతిస్పందనగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కళావతి, లీలావతి కంపెనీలకు హెడ్ గుమాస్తా ఎర్రబెల్లి దయాకర్‌రావు అని ఎద్దేవా చేశారు. ‘నన్ను విమర్శిస్తావా.. నీవ్వెంత నీ బతుకెంత’ అంటూ దయాకర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లోనే తేల్చుకుందాం రా.. అంటూ దయాకర్‌రావుకు సవాల్ విసిరారు.
‘నేను నోరు విప్పితే.. కాకతీయ కళాతోరణానికి ఉరేసుకోవాలి’ అంటూ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు దమ్ముంటే వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు పోలీస్ బలగాలు లేకుండా రావాలని.. అక్కడే రైతులు తేలుస్తారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మంత్రి కేటీఆర్ సవాల్‌పై సీఎం కేసీఆర్ స్పందించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తాగుబోతు అయితే, మంత్రి కేటీఆర్ తిరిగుబోతు అంటూ పిట్ట కథను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు.
