తొలిసారిగా తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి చిత్ర యూనిట్ తెలంగాణ శాసనసభ అభినందనలు తెలిపింది. మంగళవారం ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ బాహుబలి చిత్రం రూపొందించిన తీరు అద్భుతమన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ తో పాటు సినిమాకు సంబంధించి వారందరికి శాసనసభ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంశలు అందాయి. ఇంతకు ముందు నర్తనశాల చిత్రానికి జాతీయ స్ధాయిలో రెండో ఉత్తమ చిత్రంగానూ, శంకరాభరణం సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డులందుకున్నాయి. ఇప్పుడు తొలిసారిగా బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు రావడంతో సినీ పరిశ్రమతో పాటు తెలుగు వారంతా ఆనందభరితులవుతున్నారు.
