బాలీవుడ్ అగ్రకథానాయకుడు రణ్వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అది పరిశ్రమలో పెద్ద వివాదానికి దారితీయడంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. డాన్ 3 వివాదానికి సంబంధించి రణ్వీర్ సింగ్‌పై సదరు ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వర్మ.. అసలు ఆ ఫిల్మ్ ఫెడరేషన్‌పైనే నిషేధం విధించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు.
ఆర్జీవీ తన పోస్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గాంధీజీ పంథాలో వెళ్తున్నామంటూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) విధించిన ఈ నిషేధం చూస్తుంటే అది వారిపై వారే వేసుకునే ఒక పెద్ద జోక్‌లా కనిపిస్తోంది. ఈ చర్యలు పరిశ్రమను లేదా కార్మికులను రక్షించే ప్రయత్నం ఎంతమాత్రం కాదని.. కేవలం చిత్ర పరిశ్రమపై తమ పట్టును కోల్పోకుండా చూసుకోవడం కోసం వారు చేస్తోన్న స్వార్థపూరిత చర్యలని వర్మ విమర్శించారు. తాము 5 నుంచి 50 లక్షల మంది కార్మికుల తరఫున మాట్లాడుతున్నామని ఫెడరేషన్ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ.. అసలు ఆ లక్షలాది మందిలో చాలామందికి ఈ వివాదానికి సంబంధించిన నిజానిజాలు కూడా తెలియవని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ల తీరును ఎండగడుతూ.. అసలు ఇది తీర్పులు చెప్పడానికి ఎలాంటి న్యాయస్థానము కాదు.. అలాగని ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థా కాదు అని వర్మ తేల్చిచెప్పారు. చట్టపరమైన నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి.. ఒక నిర్దిష్ట ఎజెండాతో ప్రైవేటుగా సమావేశమయ్యే కొందరు వ్యక్తులు ఈ తీర్పును ముందే డిసైడ్ చేస్తారని ఆరోపించారు. ‘ధురంధర్’ సినిమా భారీ విజయంతో రణ్వీర్ సింగ్ సాధించిన విపరీతమైన క్రేజ్ చూసి భయపడుతోన్న కొందరు నటులు కూడా ఈ ఫెడరేషన్ కమిటీలో సభ్యులుగా ఉండటం వల్లే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో టికెట్లు అమ్ముడయ్యేది రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ల వల్లే అని.. ఇలాంటి కమిటీల వల్ల కాదని.. రణ్వీర్ లాంటి స్టార్లే ఆ లక్షలాది మంది కార్మికులకు అసలైన ఉపాధిని కల్పిస్తున్నారని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
