టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన తన ప్రేయసి కావ్యారెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాదాసీదాగా నిర్వహించినట్లు సమాచారం.
కొన్ని రోజులుగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. గత కొన్నేళ్లుగా కావ్య రెడ్డితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్ పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె కుటుంబం కూడా ప్రముఖమైనదిగా చెబుతున్నారు. కావ్య రెడ్డి తాతగారు గతంలో జడ్జిగా పనిచేసినట్టు, ఆమె తండ్రి లాయర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. రెండు కుటుంబాలకు చాలా కాలంగా పరిచయం ఉండటంతో పెద్దల సమక్షంలో ఈ సంబంధం కుదిరినట్టు తెలుస్తోంది.
నిశ్చితార్థ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త మీనన్ వంటి సినీ ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కెరీర్ విషయానికి వస్తే, 2014లో ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకీ నాయక’, ‘సాక్ష్యం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘టైసన్ నాయుడు’, ‘హైందవం’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.
