Sunday, May 5, 2024
- Advertisement -

నారా రోహిత్ ‘ఆట‌గాళ్లు’ మూవీ రివ్యూ

- Advertisement -

కెరీర్ స్టార్టింగ్‌లో విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు త‌నకంటు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్‌. హిట్, ఫ్లాప్ లతో తనకు సంబంధం లేదన్నట్లు కథ నచ్చితే చాలు సినిమా చేసేస్తుంటాడు నారా రోహిత్. ఏ యంగ్ హీరోకి లేనన్ని ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుంటాడు. గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఈ ఏడాది ‘ఆటగాళ్ళు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈరోజు విడుదలైన ఈ ఆటగాళ్ళు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించారో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:
సిద్ధార్థ్(నారా రోహిత్) సినిమా డైరెక్టర్ గా పని చేస్తుంటారు. సొసైటీలో ఆయనకు పేరు, ప్రఖ్యాతలుంటాయి. తన ఇమేజ్ విషయంలో సిద్ధార్థ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అయితే సడెన్ గా ఆయన భార్య అంజలి(దర్శన బానిక్) హత్యకు గురవుతుంది. ఈ కేసులో ముద్దాయిగా పోలీసులు సిద్ధార్థ్ ని అరెస్ట్ చేస్తారు. ఈ కేసు తరఫున వాదించడానికి కోర్టు క్రిమినల్ లాయర్ వీరేంద్ర(జగపతిబాబు)ని నియమిస్తుంది. అతడు సేకరించిన ఆధారాల ప్రకారం సిద్ధార్థ్ తన భార్యను హత్య చేశాడని తెలుసుకుంటాడు. కానీ మరోసారి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ కేసులో అసలు సూత్రధారి సిద్ధార్థ్ కాదని మున్నా అనే వ్యక్తి ఈ హత్య చేశాడని నిర్ధారణకి వచ్చి కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. అంజలి తనను ప్రేమించలేదని ఆమె హత్య చేసినట్లు మున్నా కోర్టులో అంగీకరిస్తాడు.

దీంతో అతడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. దీంతో సిద్ధార్థ్ నిర్ధోషిగా బయటకి వస్తాడు. సిద్ధార్థ్.. లాయర్ వీరేంద్రకి బహుమతిగా కారు ఇస్తాడు. దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చిన వీరేంద్రకి అసలు నిజం తెలుస్తుంది. ఈ కేసులో మున్నా అమాయకుడని తన భార్యని సిద్ధార్థ్ హత్య చేశాడని తెలుసుకొని వీరేంద్ర షాక్ అవుతాడు. న్యాయంగా ఉండే తనతోనే చట్టాన్ని మోసం చేయించాడని సిద్ధార్థ్ పై రగిలిపోతాడు. అసలు సిద్ధార్థ్ తన భార్యని ఎందుకు చంపాడు..? ఎంతగానో ప్రేమించిన తన భార్యను సిద్ధార్థ్ చంపడానికి కారణాలు ఏంటి..? లాయర్ వీరేంద్ర.. సిద్ధార్థ్ ని కోర్టులో దోషి అని నిరూపించగలడా..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

విశ్లేషణ: భిన్నమైన సినిమా తీయాలనుకోవడం, కథాకథనాలు కొత్తగా ఉండాలని ఆలోచించడం మంచిదే కానీ.. ఆ కొత్త విషయాలు ఎంత కన్విన్సింగ్ గా అనిపిస్తాయన్నది కూడా చూసుకోవాలి. లాజిక్స్ గురించి పట్టించుకోకుండా.. ప్రేక్షకులు ఏమాత్రం కన్విన్స్ అవుతారో కూడా ఆలోచించకుండా కొత్తదనం పేరుతో రాసుకునే ఇలాంటి కథలు కొన్ని కొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈ విషయంలో నారా రోహిత్ చాలా అనుభవం ఉంది కానీ మరోసారి ఈ సినిమాలో నటించి అదే తప్పు చేశాడనిపిస్తుంది. కోమాలోకి వెళ్లిన పేషెంట్ ని రెండు నిమిషాల పాటు బయటకి తీసుకు రావడం ఏంటో..? సినిమా తీసిన డైరెక్టర్ కే తెలియాలి. ఇక కథ విషయానికొస్తే.. హత్య చేసి దాని నుండి ఎస్కేప్ అవ్వాలని ఆలోచించే ఓ డైరెక్టర్, అతడిని దోషిగా నిరూపించాలని ప్రయత్నించే ఓ లాయర్. వీరిద్దరి మధ్య నడిచే కథే ఈ సినిమా. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగా హీరో అమాయకుడిగా కనిపిస్తాడు. ఎప్పుడైతే హీరోనే మర్డర్ చేశాడని రివీల్ అవుతుందో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆ ఉత్కంఠని క్యారీ చేయడంలో చిత్రబృందం విఫలమైంది. ఇక మైండ్ గేమ్ అంటూ ఇద్దరు లీడ్ క్యారెక్టర్స్ మధ్య జరిగే సంఘర్షణ పెద్దగా ఆకట్టుకోదు. పతాక సన్నివేశాలు ఊహించని విధంగా ఉన్నప్పటికీ అప్పటికే సినిమాతో విసిగిపోయిన ఆడియన్స్ కి ఆ సీన్లు కూడా పెద్దగా ఎక్కవు. హీరోయిన్ కి లిప్ సింకే ఉండదు. కామెడీ ట్రాక్ అంటూ బ్రహ్మనందాన్ని తీసుకొచ్చి ఏదేదో చేసేసి మరింత విసిగించారు.

న‌టీన‌టుల పెర్ఫార్మన్స్ : సినిమాకు చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే నటీనటుల ప్రతిభే. ఇద్దరు ప్రధాన పాత్రధారులూ మెప్పిస్తారు. నారా రోహిత్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరంభంలో మంచివాడిగా, ఆ తరువాత విలన్ గా నటనలో ప్రతిభ చూపించే సన్నివేశాల్లో రోహిత్ ఆకట్టుకుంటాడు. సినిమా అంతటా కూడా అతను ఆకట్టుకుంటాడు. జగపతిబాబు ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయాడు. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని లాజిక్స్ కి కూడా అండవు. హీరోయిన్ పెద్దగా ఆకట్టుకోదు.

సాంకేతిక వ‌ర్గ ప‌నితీరు :పాటలు ఏమంత ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం ఫరవాలేదు. విజయ్ సి కుమార్ ఛాయాగ్రహణం పర్వాలేదు. గొప్పగా అనిపించకపోయినా సినిమా మూడ్ కు తగ్గట్లుగా సాగుతుంది. నిర్మాణ విలువలు అంత ఆకట్టుకోవు. బడ్జెట్ పరిమితులు చాలా చోట్ల తెలుస్తూనే ఉంటాయి. ఇక డైరెక్టర్ పరుచూరి మురళి కొత్తగా ఏదో ప్రయత్నించబోయి బోల్తా కొట్టేశాడు. కొన్ని చోట్ల కథలోకి ఇన్‌వాల్వ్‌ చేయడంలో సక్సెస్‌ అయినప్పటికీ కీలకమైన విషయాలని కరక్ట్‌గా తెరకెక్కించడంలో తడబడ్డాడు. కన్విన్సింగ్ గా అనిపించని కథాకథనాలు సినిమాకు పెద్ద మైనస్ అయిపోయాయి. మరోసారి నారా రోహిత్ ఎన్నుకున్న కథలో విషయం ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఆవిష్కరించే విధానంలో తప్పుడు దొర్లడంతో అంచనాలను అందుకులేకపోయింది.

బోట‌మ్ లైన్ :మ‌రో ప్లాప్ మూవీతో వ‌చ్చిన నారా రోహిత్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -