బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన మొదటి భార్య రంజనా ఝా బీహార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదులో ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన రెండో భార్య దీపా నారాయణ్ మరియు ఇద్దరు సోదరుల పేర్లు కూడా ఉన్నాయి. 1996లో వైద్య పరీక్షల పేరుతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లి, తన అనుమతి లేకుండా గర్భాశయాన్ని తొలగించారని రంజనా ఆరోపించారు. ఈ ఘటనకు దశాబ్దాలు గడిచినప్పటికీ, ఇప్పుడు న్యాయం కోసం ముందుకు రావడం సంగీత వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పోలీసులు రంజనా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పాత వైద్య రికార్డులు, సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఉదిత్ నారాయణ్‌కు ఇది తొలి వివాదం కాదు. గత ఏడాది ఒక లైవ్ కాన్సర్ట్‌లో మహిళా అభిమాని పట్ల ఆయన ప్రవర్తించిన తీరు కూడా విమర్శలకు దారితీసింది. ఫోటో అడిగిన అభిమానిని ముద్దుపెట్టుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమైంది. అయితే అభిమానుల పట్ల ప్రేమతోనే అలా జరిగిందని ఆయన అప్పట్లో వివరణ ఇచ్చారు.
తాజా కేసు నేపథ్యంలో ఆయన వ్యక్తిగత ప్రతిష్టపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ‘మీసాల పిల్లా..’ పాటతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
