హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినికి మత్తు మందులు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాదిగా తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్ల రూపంలో మత్తు పదార్థాలు ఇచ్చి కాలేజీ ప్రాంగణంలోనే కాకుండా హోటళ్లలో కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.
అంతేకాకుండా ఆశిష్‌తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్ కూడా వరుసగా దాడులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు చేయకపోతే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని బాధితురాలు వెల్లడించినట్టు ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కాలేజ్ సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదని కూడా తెలిపారు.
శనివారం విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ ఘటన బయటపడింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
