సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గుండెలవిసే దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడై మారి, కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ప్రాణాలు తీయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మణిదీప్ అనే లారీ డ్రైవర్, తల్లిదండ్రులు లేని శిరీష (24) అనే యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి సంసారంలో ఏడాది క్రితం గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి, నచ్చజెప్పడంతో ఇద్దరూ కలిసి ఉంటున్నారు.
ఇటీవల దంపతుల మధ్య మళ్ళీ వివాదం చెలరేగింది. దీంతో శిరీష తన పెద్దమ్మతో కలిసి భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించివేశారు.స్టేషన్ నుండి బయటకు వచ్చిన శిరీష, తన పెద్దమ్మతో కలిసి జగ్గయ్యపేట వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా.. ఒక్కసారిగా మణిదీప్ ఆమెపై దాడికి దిగాడు. ఆటోలో నుంచి ఆమెను బయటకు లాగేశాడు.
భర్త చేతిలో కత్తిని చూసి ప్రాణభయంతో శిరీష సమీపంలోని ఒక టీ స్టాల్‌లోకి పరుగులు తీసింది. అయినప్పటికీ వదలని మణిదీప్, ఆమెను వెంటాడి అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పట్టపగలు, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు మణిదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలా రాక్షసుడిగా మారి హత్య చేయడంతో, ఆ రెండేళ్ల చిన్నారి ఇప్పుడు అటు తల్లికి దూరమై, ఇటు తండ్రి జైలు పాలవడంతో అనాథగా మిగిలిపోయాడు.
