పరమ పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో తీవ్ర కలకలం రేగింది. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తూ సాగుతున్న అక్రమ మద్యం దందాను పోలీసులు రట్టు చేశారు. భారీ స్థాయిలో మద్యం బాటిళ్లతో పాటు నాటుసారాను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
నమ్మదగిన సమాచారం మేరకు శ్రీశైలం పోలీసులు బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణతో పాటు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సిద్దరామప్ప కాంప్లెక్స్ పరిసరాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 314 క్వాటర్ మద్యం బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిషిద్ధ ప్రాంతంలో మద్యం విక్రయించినందుకు గాను కేసులు నమోదు చేశారు. శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రంలో మహిళలే ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడటం విస్మయానికి గురిచేస్తోంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆత్మకూరు నుండి గుట్టుచప్పుడు కాకుండా శ్రీశైలం క్షేత్రానికి మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.బయట నుంచి తక్కువ ధరకు తెచ్చి, ఇక్కడ అధిక ధరలకు హోటల్ కార్మికులకు మరియు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన చోట ఇలా మద్యం ఏరులై పారడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు సరిగ్గా జరగడం లేదని, అందుకే ఇంత భారీ స్థాయిలో మద్యం లోపలికి వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.శ్రీశైల క్షేత్రంలో మద్యం, మాంసం, ఇతర నిషిద్ధ వస్తువుల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిరంతరం నిఘా కొనసాగిస్తాం అన్నారు.
