ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించారన్న కారణంతో ముగ్గురు బాలికలు తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతులు ముగ్గురూ అక్కాచెల్లెళ్లు కావడం ఈ ఘటనను మరింత విషాదంగా మార్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆ బాలికలు ఇటీవల ఫోన్ వినియోగానికి తీవ్రంగా అలవాటుపడి ఆన్‌లైన్ గేమ్స్‌లో మునిగిపోయారు. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసై స్కూల్‌కు వెళ్లడాన్ని కూడా మానేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ప్రవర్తనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, చదువుపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. అయితే ఈ మాటలను బాలికలు తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మనస్థాపం చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనం, మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతో సంభాషణ, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఎంతో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
