వికారాబాద్ జిల్లాలోని పరిగిలో దారుణం చోటు చేసుకుంది. రైతు బీమా డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారి, ఓ వ్యక్తి తన తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, రూప్‌సింగ్ తండాకు చెందిన హనుమంతు అనే వ్యక్తికి నాతిబాయి, రమణీబాయి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇటీవల మొదటి భార్య నాతిబాయి అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణంతో వచ్చిన రైతు బీమా డబ్బులో వాటా ఇవ్వాలని, అలాగే భూమిని పంచి ఇవ్వాలని మొదటి భార్య కుమారుడు అనార్‌సింగ్ తన తండ్రిని కోరాడు.
అయితే హనుమంతు దీనికి నిరాకరించడంతో, కోపోద్రిక్తుడైన అనార్‌సింగ్ దారుణానికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో ఇంటి పైకప్పు పైకి ఎక్కి రంధ్రం చేసి, లోపల నిద్రిస్తున్న తన తండ్రి, రెండవ భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు కేకలు వేయగా, స్థానికులు అప్రమత్తమై వెంటనే వారిని బయటకు తీసి రక్షించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడు అనార్‌సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
