“పవన్ కళ్యాణ్ హఠావో” పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. శ్రీనివాస్ మరణంపై నెలకొన్న మిస్టరీను పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ద్వారా ఆయనను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణమని తేలింది. నార్కట్‌పల్లి–నకిరేకల్ మధ్య ప్రాంతంలో శ్రీనివాస్‌ను హత్య చేసి, అనంతరం పాలేరు రిజర్వాయర్‌లో మృతదేహాన్ని పడేశారని గుర్తించారు. ఘటనను కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
కేసును లోతుగా దర్యాప్తు చేసి, సీసీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. పోలీసులు స్పష్టం చేసిన ప్రకారం, శ్రీనివాస్ రాసిన “పవన్ కళ్యాణ్ హఠావో” పుస్తకానికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
