ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా పామూరు మండలం అయ్యవారిపల్లిలో కలకలం రేపిన దుర్ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువ టీచర్ మాధవి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పామూరులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మాధవి, నాగూర్ భాష అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని, అది క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు సమాచారం. అయితే కొంతకాలం తర్వాత అతనికి ఇప్పటికే పెళ్లి అయిన విషయం తెలుసుకున్న మాధవి, అతనితో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఇదే విషయంపై ఆగ్రహించిన నాగూర్ భాష, తమ వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ బెదిరింపుల కారణంగా మాధవి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో తీవ్ర ఆవేదనకు లోనైన మాధవి, చనిపోవడానికి ముందు తన చేతిపై “నాన్న జాగ్రత్త” అని రాసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనపై మాధవి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి, నాగూర్ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
