ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బరేలీకి చెందిన జితేంద్ర యాదవ్, జ్యోతి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోగా ఆ తర్వాత జితేంద్ర జీవితం నరకంగా మారిపోయింది. పెళ్లి అనంతరం భార్య జ్యోతి విశ్వరూపం చూసి జితేంద్ర షాక్‌కు గురయ్యాడు. అతడు ఎప్పుడూ ఊహించని ప్రవర్తనను ఆమె చూపింది.
సీన్ కట్ చేస్తే పెళ్లైన కొద్ది నెలలకే జితేంద్రను హత్య చేశారు. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే… 9 ఏళ్ల పాటు పెళ్లి కోసం ఎదురు చూసిన భార్య జ్యోతి చేతుల మీదుగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బరేలీలోని ఇజ్జత్‌నగర్ పరిధిలో ఉన్న కైలాష్‌పురం కాలనీలో జరిగింది. అక్కడ నివసించే కాంట్రాక్ట్ ఉద్యోగి జితేంద్ర యాదవ్ తన భార్య జ్యోతితో కలిసి నివసిస్తున్నాడు. 9 ఏళ్ల ప్రేమ సంబంధం తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇటీవల అకస్మాత్తుగా జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం వెలువడింది. మొదట కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా దీన్ని ఆత్మహత్యగానే భావించారు.
అయితే పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ బృందం నివేదికలతో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది. జితేంద్రను గొంతు నులిమి చంపి, అనంతరం ఫందాకు వేలాడదీసినట్లు నిర్ధారణ అయింది. ఇది హత్య అని తెలిసిన తర్వాత జితేంద్ర కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. వెంటనే భార్య జ్యోతిపై ఆరోపణలు చేశారు. రోడ్‌వేస్ కండక్టర్‌గా పనిచేసే జ్యోతి, పెళ్లి తర్వాత జితేంద్రను మానసికంగా వేధించేదని వారు తెలిపారు. గ్రామంలో ఉన్న జితేంద్ర ఆస్తిని అమ్మి, నగరంలో ఇల్లు, కారు తన పేరుపై కొనాలంటూ ఒత్తిడి చేసేదని చెప్పారు. అయితే దీనికి జితేంద్ర అంగీకరించలేదు.
అదే సమయంలో జితేంద్రను అత్తమామల కుటుంబం కూడా వేధించిందని, జ్యోతి పేరుపై భూమి, కారు కొనకపోతే వరకట్న వేధింపుల కేసులో ఇరికిస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణను ఆ దిశగా మళ్లించారు. హత్యకు, ఆధారాలను తుడిచివేయడానికి ఆమె కుటుంబ సభ్యులు సహకరించినట్లు ఆధారాలు లభించాయి. సీసీటీవీ కెమెరాల్లో జితేంద్ర అత్తమామల కదలికలు కూడా నమోదయ్యాయి.
దీంతో అనుమానాలు బలపడగా, పోలీసులు జ్యోతి సహా ఆమె బంధువులను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు. విచారణలో జ్యోతి విరిగిపోయి మొత్తం నేరాన్ని ఒప్పుకుంది. ఈ కేసులో జితేంద్ర భార్య జ్యోతి తో పాటు ఆమెకు చెందిన ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.
