జగిత్యాల పట్టణంలో మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను స్మశాన వాటికలో వదిలేసి భార్య వెళ్లిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. శ్రీధర్ అనే వ్యక్తి రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించింది.
అయితే, ఈ క్లిష్ట పరిస్థితిలో ఆయనకు తోడుగా ఉండాల్సిన భార్య, ఆయనను జగిత్యాల స్మశాన వాటికలో వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
స్మశానంలో దయనీయ స్థితిలో ఉన్న శ్రీధర్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. ఆయనను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనతో కుటుంబ విలువలు, మానవత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఇలాంటి పరిస్థితిలో వదిలేయడం అమానుషమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
