కడప జిల్లా కాశినాయన మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంగన్నపల్లె హరిజనవాడకు చెందిన కందుల దిలీప్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన దిలీప్ ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దిలీప్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నాయనపల్లె గ్రామానికి చెందిన ఓ యువతికి పార్సెల్ డెలివరీ విషయంలో అపార్థాలు ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు దిలీప్‌పై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే తనపై యువతి బంధువులే దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నాడు. పార్సెల్ డెలివరీ పేరుతో పిలిచి, తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపించాడు. ఘటన తర్వాత స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు కారణాలు ఏమిటి? ఎవరెవరు పాల్గొన్నారు? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
