నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2 – తాండవం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, బాలయ్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది. అఖండ చిత్రానికి సీక్వెల్ కావడంతో, ఈ సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో మెరిశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య రెండో కుమార్తె తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పించడం విశేషం.
డిసెంబర్ 12 (శుక్రవారం)న విడుదలైన అఖండ 2 – తాండవం, తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ నట విశ్వరూపం, శివతాండవాన్ని తలపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పండగ వాతావరణాన్ని కల్పించాయి. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ సందడి, జై బాలయ్య నినాదాలతో సినిమా విడుదల రోజే ఒక ఉత్సవంలా మారింది.
బోయపాటి శ్రీను మార్క్ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. బాలయ్య పాత్రలోని ఆగ్రహం, ఆధ్యాత్మికత మేళవింపుతో ప్రేక్షకులు థియేటర్లలో కూర్చునే కట్టిపడేశారు.విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.59.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో వీకెండ్ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంతో ఒకటి లేదా రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను అఖండ 2 దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ జోరు కొనసాగితే బాలయ్య కెరీర్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా ‘అఖండ 2 – తాండవం’ నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
