ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు వంద రోజుల్లోనే తమ అసలు రంగును బయటపెడుతున్నారు. ఇసుక మాఫియా దగ్గరి నుండి ప్రతిపక్ష పార్టీల నేతల టార్గెట్, లిక్కర్ మాఫియా వరకు అన్నింట్లో తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. టీడీపీ,బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఒకరిని మించి మరొకరూ పోటిపడి మరి అధికారాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
ఇక ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధించి చంద్రబాబు మరో నియంతలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే మీడియాను అణచివేసి తమకు అనుకూలంగా ఉండే మీడియాకే అందలం వేస్తున్నారు. అధికార దుర్వినియోగం, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు టీవీఛానళ్లపై కక్షకట్టారు. తెలుగువారిలో అత్యంత ప్రజాదరణ పొందిన Sakshi TV, NTV, TV 9 న్యూస్ ఛానళ్లపై చంద్రబాబు కత్తికట్టారు.
రాష్ట్రంలో ఎక్కడా ఈ ఛానళ్లు ప్రసారం కాకూడదని హుకుం జారీచేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేబుల్‌ఆపరేటర్లు ఆయా ఛానళ్లప్రసారాలను నిలిపేశారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన కేబుల్ ఆపరేటర్లతో సమావేశంపెట్టి మరీ ఈ దారుణాలకు దిగారు. పోలీసు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్డా సహా మరికొందరు అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పలువురు వాపోతున్నారు.
