- Advertisement -

మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు

- Advertisement -

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి, అలాగే క్రీడాభిమానులందరికీ ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మెస్సీ పాల్గొన్న కార్యక్రమం తీవ్ర గందరగోళంగా మారడంతో, అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కోల్‌కతాకు వచ్చిన మెస్సీ, సాల్ట్‌లేక్ స్టేడియంలో అభిమానులను అభివాదం చేయాల్సి ఉండగా, సరైన ఏర్పాట్లు లేకపోవడం, నాయకులు–అధికారుల ఫోటో సెషన్లతో సమయం వృథా కావడంతో పరిస్థితి అదుపు తప్పింది. మెస్సీ పూర్తి మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి హుటాహుటిన వెళ్లిపోవడంతో వేలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేయడం, స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై, మెస్సీ టీమ్‌ను వెంటనే స్టేడియం నుంచి బయటకు తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ, “ఇది చాలా బాధాకరమైన సంఘటన. మెస్సీకి, క్రీడాభిమానులకు కలిగిన అసౌకర్యానికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ ద్వారా ఏర్పాట్లలో జరిగిన లోపాలు, భద్రతా వైఫల్యాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన మెస్సీ పర్యటన ఇలాంటి వివాదంతో ముగియడం పట్ల క్రీడాభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -