తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండగా, తాజా పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ఎప్పుడు బాధ్యతలు చేపడతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ మరియు ఆయన బృందం జరిపిన 40 నిమిషాల సుదీర్ఘ చర్చలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భేటీ తర్వాత కూడా గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో హైటెన్షన్ కొనసాగుతోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్‌కు గవర్నర్ ఒక కీలక షరతు విధించినట్లు తెలుస్తోంది.అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేల స్పష్టమైన మద్దతును నిరూపించుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు న్యాయవాదుల సలహా తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ వెల్లడించారు.గవర్నర్‌తో భేటీ ముగిసిన కాసేపటికే టీవీకే కార్యాలయానికి గవర్నర్ సెక్రటేరియట్ నుంచి ఫోన్ వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో విజయ్ వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి. తమ వద్ద సరిపడా బలం ఉందని, అవసరమైతే ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమని విజయ్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇతర పార్టీల మద్దతు మరియు విలీనం వంటి సాంకేతిక అంశాలపై గవర్నర్ న్యాయ సలహా కోరారు.మరోవైపు, చెన్నై వీధుల్లో విజయ్ అభిమానులు మరియు టీవీకే కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
