Saturday, May 4, 2024
- Advertisement -

బడా నేతలకు ఒక లెక్క… చోటా నేతలకు ఓ లెక్కా!

- Advertisement -

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఎత్తుగడలతో ముందుకు వెళ్తుండగా బీజేపీ సైతం రేసులోకి వచ్చింది. ఆశావాహులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించగా దాదాపు 6 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. దీంతో తమ పార్టీ టికెట్లకు ఎంత పోటీ ఉందో అర్ధం చేసుకోవాలని మీడియా ముందు గొప్పలు చెప్పారు నేతలు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సీన్ కట్ చేస్తే అసలు విషయం బయటపడింది.

ఒక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తప్ప సీనియర్ నేతలెవరు తమకు టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఈ విషయం తెలిసి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ లీడర్లకు ఓ లెక్కా…మిగితా వారికి మరో లెక్కా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ , ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అరవింద్, సోయం బాబూరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసుకోలేదు. బండి సంజయ్, అరవింద్ ఈ సారి అసెంబ్లీకి పోటీచేస్తారని గతంలో ప్రచారం జరిగినా వారు ఏ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా దరఖాస్తు చేసుకోలేదు.

వివేక్ వెంకట స్వామి, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు సీనియర్ నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకునేందుకు సముఖత చూపలేదు. దీంతో పార్టీ జాతీయ నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దరఖాస్తు ప్రక్రియను సీనియర్ నేతలు లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో క్రమశిక్షణ ఇదేనా అంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించినా సీనియర్ లీడర్లు పట్టించుకోలేదు. దీంతో క్యాడర్ సీనియర్ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -