ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన తాత్కాలికంగా వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీ నుండి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సన్నాహాక సమావేశాలను నిర్వహించింది. అయితే తాత్కాలికంగా కులగణనను డిసెంబర్ 10వ తేదీ నుండి చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. చేపట్టాలని నిర్ణయించారు.
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేసి ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇక బీసీల కులగణన కోసం ప్రత్యేక యాప్ సిద్ధం చేశారు. కులగణనలో వాలంటీర్లు ప్రత్యేక పాత్ర పోషించనుండగా వారి సెల్ ఫోన్‌లలో ప్రత్యేక యాప్ పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్ ఫోన్ ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తి అయిన తరువాత గానీ, స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా యాప్ ను డిజైన్ చేశారు.
కులగణనతో పాటు వారు చేస్తున్న ఉపాధి, ఉపకులం అన్ని వివరాలను పూర్తిగా సేకరించనున్నారు. దీని ద్వారా బీసీ కులాలకు సంబంధించి స్పష్టత వచ్చిన అనంతరం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది అనేదానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
