తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నోటిఫికేషన్ ఏప్రిల్–మే నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటరు జాబితాల శుద్ధి ప్రక్రియను మరింత పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోందని పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్ (BLA)ను నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించారు. BLAs ద్వారా ఓటరు జాబితాలో తప్పులు, డూప్లికేట్ పేర్లు, మరణించిన వారి వివరాలను సకాలంలో గుర్తించి సరిదిద్దే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
అదే విధంగా, 2025 ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లను 2002 SIRలో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా ఓటరు జాబితాలో పారదర్శకత పెరగడంతో పాటు, అక్రమ నమోదు అవకాశాలు తగ్గుతాయని చెప్పారు.
రాజకీయ పార్టీల సహకారంతో ఓటరు జాబితా మరింత ఖచ్చితంగా, నమ్మదగినదిగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన CEO, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసం పెరగడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
