కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ సమస్య పెరుగుతోందని, దీనిని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సినీ నటులు తప్పనిసరిగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే వారి సినిమాలను విడుదల చేయాలని సూచించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ మూలాలు సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. అందుకే సినీ నటులు డ్రగ్స్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేయాలని అన్నారు. ఒకవేళ ఎవరు డ్రగ్స్ టెస్ట్‌కు నిరాకరిస్తే వారి సినిమాల విడుదలను నిలిపివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే డ్రగ్స్ వినియోగంపై నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు.
ఇక ప్రజాప్రతినిధుల విషయంలో కూడా కఠిన నిబంధనలు ఉండాలని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ప్రజాప్రతినిధులు ప్రతి 90 రోజులకు ఒకసారి తప్పనిసరిగా డ్రగ్స్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. టెస్ట్ చేయించుకోవడానికి ఎవరు నిరాకరిస్తే వారికి చట్టసభల్లోకి అనుమతి ఇవ్వకూడదని అన్నారు.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. సమాజంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
