మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలకమైన హార్మూజ్ జలసంధిని దాటి ఒక చమురు ట్యాంకర్ సురక్షితంగా ముంబై పోర్ట్ చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్ట్ వద్ద ముడి చమురు లోడ్ చేసుకున్న ఈ నౌక లైబీరియా జెండా కింద ప్రయాణించింది.
“షెన్‌లాంగ్ స్యూజ్‌మాక్స్” అనే ఈ భారీ ట్యాంకర్‌కు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత ఈ నౌక హోర్ముజ్ జలసంధిని దాటి ముంబైకి చేరిందని ముంబై పోర్టు అధికారులు తెలిపారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత భారతీయ చమురు ట్యాంకర్లకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. అయితే ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల తర్వాత ఇరాన్ ఈ ప్రాంతంలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి కొన్ని నౌకలపై దాడులు జరిపింది.
ఇప్పటివరకు కనీసం 16 నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పరిస్థితి వల్ల గ్లోబల్ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారత జెండా నౌకలు పనిచేస్తున్నాయి. వీటిలో 677 మంది భారతీయ నావికులు ఉన్న 24 నౌకలు హోర్ముజ్ పశ్చిమ భాగంలో ఉండగా, 101 మంది నావికులు ఉన్న నాలుగు నౌకలు తూర్పు వైపున ఉన్నాయి.
భారత నౌకలు మరియు నావికుల భద్రతపై ప్రభుత్వం 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల వరకు పెరిగే అవకాశముందని ఇరాన్ హెచ్చరించింది.
