రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి చిన్న విషయం కాదని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని ప్రజల ముందుకు తీసుకువస్తానని ప్రకటించారు. ఎవరికెంత టెండర్లు కేటాయించారో పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి కు పట్టు లేదని విమర్శించారు. ప్రతిపక్షంగా తాము సక్సెస్ అయ్యామని, ఏ అంశంపై వెళ్లినా ప్రభుత్వం స్పందించాల్సి వస్తోందని చెప్పారు. ఖమ్మంలో కేటీఆర్ పర్యటించిన తర్వాతే అక్కడ స్థలాలు, ఇళ్ల హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. తాను శారదా పీఠం వెళ్లినప్పుడు ఆపేందుకు ప్రయత్నించారని, దేవాదుల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. హెల్త్ సిటీ విషయంలో కూడా తాము వెళ్లిన తర్వాతే స్పందించారని విమర్శించారు.
జర్నలిస్టుల హెల్త్ స్కీంను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వ కాలంలో ప్రత్యేక జీవో జారీ చేసి ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. ఇక అక్రమ మైనింగ్‌పై కూడా హరీష్ రావు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మేనల్లుడికి సంబంధించిన వ్యక్తులు నియోపోలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కే అనుమతి ఉండగా, ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.
