టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని చిన్నికి 2024 ఎన్నికల్లో కేశినేని చిన్నికి పలు దఫాలుగా 5 కోట్లు ఇచ్చానని సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ని సైతం జతపర్చారు కొలికపూడి శ్రీనివాసరావు. చిన్నికి ఇచ్చిన నగదుపై రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొబైల్ స్టేటస్ పెట్టారు.
ఇవాళ తిరువూరులో పర్యటించారు ఎంపీ చిన్ని. ఈ సందర్భంగా కొలికపూడిపై పలు ఆరోపణలు చేయగా ఎక్స్ వేదికగా చిన్నిపై బాంబు పేల్చారు కొలికపూడి. ఈ వ్యవహారంపై రేపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కొలికపూడి శ్రీనివాసరావు కలవనున్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని అంతే ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి నగదును ఆశించే స్థితిలో లేనని తేల్చి చెప్పారు. అంతేకాదు తన సొంత డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు. తిరువూరు టీడీపీలో వర్గ పోరు ఎప్పటినుండో నడుస్తోంది. ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గంగా పార్టీ చీలిపోయి నేతలు ఫైట్ చేసుకుంటున్నారు.
