కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సాల్ట్ లేక్ స్టేడియంలో జరగాల్సిన లియోనల్ మెస్సీ మ్యాచ్ అనూహ్యంగా రద్దు కావడంతో భారీ గందరగోళం నెలకొంది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు కోల్‌కాతాకు చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగకుండా మెస్సీ వెళ్లిపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం వెల్లువెత్తింది.
మ్యాచ్ రద్దు వార్త వెలువడిన వెంటనే స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. “ఇంత దూరం వచ్చాం.. మ్యాచ్ ఆడకుండా వెళ్తే ఎలా?” అంటూ అభిమానులు నిర్వాహకులను ప్రశ్నించారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, భద్రత, ప్రవేశ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభిమానుల ఆరోపణల ప్రకారం, మెస్సీని అభిమానులకు దగ్గర చేయకుండా నాయకులు, ప్రముఖులు ఫోటోలు దిగడంలోనే సమయం వృథా చేశారని, దాని వల్లే మ్యాచ్ జరగకుండానే మెస్సీ వెళ్లిపోయాడని మండిపడ్డారు. ఈ పరిణామం అభిమానుల సహనాన్ని పూర్తిగా దాటిపోయింది.
దీంతో కొందరు అభిమానులు స్టేడియంలో విద్వంసానికి పాల్పడ్డారు. టెంట్లను కూల్చివేయడం, కుర్చీలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తానికి, మెస్సీ మ్యాచ్ రద్దు ఘటన అభిమానుల కలలను చిదిమేసిన సంఘటనగా మారింది. సరైన ప్రణాళిక, నిర్వహణ లేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
