దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట మావోయిస్టులు మరోసారి ప్రకటన విడుదల చేశారు. హిడ్మా – శంకర్ల మరణం ఎన్కౌంటర్ కాదని, ఇది పూర్తిగా “భూటకపు హత్య” అని లేఖలో ఆరోపించారు. గత వారం రోజుల పాటు తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ఈ ఇద్దరిని హతమార్చారని మావోయిస్టులు పేర్కొన్నారు.
ప్రకటనలో చెప్పిన వివరాల ప్రకారం, అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మా, శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది కలప వ్యాపారులు ద్రోహం చేయడంతో హిద్మా–శంకర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు లేఖలో ఆరోపించారు. అదనంగా, అరెస్ట్ అనంతరం వారిని కస్టడీలో పెట్టి వారం రోజులు తీవ్రంగా హింసించి చివరికి చంపేశారనే తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఘటనను “ఎన్కౌంటర్”గా చూపించడం పూర్తిగా జవాన్ల కథనమని, నిజంలో ఎలాంటి ఎదురుకాల్పులు జరగలేదని జోనల్ కమిటీ లేఖ స్పష్టం చేసింది. హిడ్మా, శంకర్ల మరణాలపై సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరగాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే న్యాయస్థానాల పర్యవేక్షణలో విచారణ అవసరమని పేర్కొన్నారు.
ప్రాదేశిక ప్రజలు, ప్రజాసంస్థలు, హక్కుల సంఘాలు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని లేఖలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పోలీసులు నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చితే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని మావోయిస్టుల లేఖలో విమర్శించారు.


