రాజకీయాల్లో పవన్ వ్యవహార శైలీ ఏంటో తెలియక అటు జనసేన నేతలే కాదు టీడీపీ,బీజేపీ నేతలు సైతం అయోమయంలో ఉన్నారు. ఓసారి బీజేపీతో పొత్తు అంటారు..మరోసారి లేదంటారు. టీడీపీతో పొత్తు దశాబ్ద కాలం కొనసాగుతుంది అంటారు అంతలోనే ఆ పార్టీ నేతలకు నో చెబుతున్నారు పవన్. ఇప్పుడు పవన్ వ్యవహరిస్తున్న తీరు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది. ఇక భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని సైతం ఈ బహిరంగసభకు ఆహ్వానించారు టీడీపీ నేతలు.
అయితే వారికి నో చెప్పారు పవన్. దీంతో పవన్ ఇచ్చిన సమాధానంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారని తెలుస్తోంది. కీలక సభకు హాజరు కాకుండా భవిష్యత్‌లో టీడీపీ నిర్వహించే సభకు హాజరవుతానని పవన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈసారి ఎన్నికల్లో పవన్‌పైనే ఎక్కువగా ఆధారపడింది టీడీపీ. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ సైతం అదేస్ధాయిలో స్పందించారు. కానీ ప్రస్తుతం పవన్ చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకపోవడంతో టీడీపీ అధినేతతో పాటు నాయకులు సైతం ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి పవన్ నో చెప్పారనే వార్త మాత్రం ట్రెండింగ్‌గా మారింది.
