కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మైండ్ సెట్ మారిందా…?ఘర్ వాపసీలో భాగంగా పొన్నాల తిరిగి కారెక్కనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చేరికలో జోష్‌తో అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాలో ఉంది కాంగ్రెస్. అందుకే పార్టీ వీడిన నేతలందరిని తిరిగి అక్కున చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయగా ఎల్లుండి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇదే బాటలో పొన్నాల పయనించనున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పొన్నాల తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరి వారం రోజులు దాటుతున్న ఒక్క నేత కూడా పొన్నాల ఇంటి తలుపుతట్టలేదట. దీనికి తోడు ప్రస్తుతం ఎన్నికల వాతావరణం హీటెక్కింది. సీనియర్ నేతనైన తనకు ఎలాంటి బాధ్యత అప్పజెప్పకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారట పొన్నాల. ఏ బీసీ కార్డును ఉపయోగించి పార్టీ మారారో ఇప్పుడు అదే కార్డు ఉపయోగించి తిరిగి హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారట.
తన స్నేహితులైన భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అలాగే కేవీపీ రామచంద్రరావు సైతం పొన్నాలను తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పొన్నాల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనుండగా ఇప్పుడు కాంగ్రెస్ ఘర్ వాపసీ అంశం చర్చనీయాంశంగా మారింది.
