- Advertisement -

మేడారం వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ ఇవాళ మేడారంలో కొలువుదీరనుంది. రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా మారింది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్ వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.

సాయంత్రం 4.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు మేడారానికి చేరుకోనున్నారు. అనంతరం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో వారికి ఘన స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు హరిత హోటల్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. సమావేశం అనంతరం సీఎం, మంత్రులు అక్కడే బస చేయనున్నారు. హరిత హోటల్‌లో 16 గదులు, టెంట్ సిటీలో 40 తాత్కాలిక గదులు ఏర్పాటు చేయగా, మొత్తం 300 మంది బస చేసేలా ఇతర హరిత హోటళ్లు, రిసార్టులను అధికారులు ముందుగానే బుక్ చేశారు.

కేబినెట్ భేటీ సందర్భంగా మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటనకు 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. డ్రోన్ ఎగరవేతపై కఠిన నిషేధం విధించినట్లు ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ తెలిపారు.

మేడారం వేదికగా జరిగే ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం, మేడారం అభివృద్ధి, మున్సిపల్ ఎన్నికల వ్యూహం వంటి కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. సమ్మక్క–సారలమ్మ జాతరకు ముందే ఇక్కడ కేబినెట్ నిర్వహించడం ప్రభుత్వ ప్రాధాన్యతను చాటిచెప్పే చర్యగా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -