హైదరాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వరుసగా రూపొందుతున్న కొత్త కాలనీల అవసరాలను దృష్టిలో పెట్టుకొని TGSRTC కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో రూపొందించిన ఈ కార్యాచరణలో భాగంగా, ఇప్పటి వరకు బస్సు సౌకర్యం చేరని ప్రాంతాలకు కూడా ప్రజా రవాణాను విస్తరించనుంది.
ఆర్టీసీ అధికారులు గుర్తించిన 373 కొత్త కాలనీలు ఇకపై బస్సు సేవలతో అనుసంధానం కానున్నాయి. ఈ సేవలు డిసెంబర్ నెల నుంచే దశల వారీగా ప్రారంభం కానున్నట్లు సంస్థ తెలిపింది. నగర పరిధిలో రోజువారీ ప్రయాణాలు చేసే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది.
ఈ కొత్త ప్రణాళికతో సుమారు 7.61 లక్షల మంది నగరవాసులకు ప్రత్యక్షంగా రవాణా సదుపాయం లభించనుంది. ముఖ్యంగా మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న రియల్టీ జోన్లను బస్సు మార్గాలతో కలిపి నగర వ్యాప్తంగా కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
పౌరులకు అందుబాటులో, చౌకగా, సురక్షితంగా ప్రయాణ సౌకర్యం ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిన ‘హైదరాబాద్ కనెక్ట్’ ద్వారా, రాబోయే నెలల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఆర్టీసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
