ప్రజానేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. పలు చోట్ల రక్తదానం చేశారు.
వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన విజనరీ లీడర్ వైఎస్ అని కొనియాడారు. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేసిన మానవతావాది అని…సంక్షేమ పథకాలతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహనీయుడు అని కొనియాడారు. ఏపీలోని వైసీపీ పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా వైఎస్ అందించిన సేవలు దేశంలోనే ట్రెండ్ సెట్ చేశాయి అన్నారు వైవీ సుబ్బారెడ్డి. పేదవాడికి ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయి అన్నారు. వైఎస్ నుండి క్రమశిక్షణ అలవర్చుకోవాలని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఆయన జీవితమంతా ప్రజా సేవలోనే గడిపారని… ప్రత్యర్థులను కూడా సమ్మోహితుల్ని చేయగల నాయకుడు అన్నారు.
ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయ నాయకులు వైయస్సార్. నాయకుడంటే వైయస్ రాజశేఖర్ రెడ్డిలా ఉండాలని అందరూ కోరుకుంటారు అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. అన్నలా, తమ్ముడిలా, ఇంటికి పెద్ద కొడుకిలా ప్రతి కుటుంబానికి ఆయన ఆప్తుడు అన్నారు. వైఎస్స్ఆర్ ప్రజా నాయకుడు… రాజకీయాల్లో వైఎస్ లాంటి అరుదైన నాయకులు అతికొద్ది మందే ఉంటారు అన్నారు మల్లాది విష్ణు. ఆయన ఆలోచనలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఏర్పాటైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా నిలబడిందని మల్లాది విష్ణు అన్నారు.
వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని తెలిపారు మాజీ ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారు…. అభివృద్ధి సంక్షేమం పూర్తిగా ఆగిపోయింది. శాంతిభద్రతలు గాడి తప్పాయి అన్నారు. యూఏఈలో వైఎస్ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 మందికి పైగా కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
