ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. వైసీపీ నాయకులు… ప్రముఖ న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి… ఏబీఎన్ రాధాకృష్ణ ప్రసారం చేసిన కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ కథనాలు తమ పార్టీ నేతలను కించపరిచేలా ఉండటమే కాకుండా, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
అలాగే, ఈ ప్రసారాలు కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఈ ఘటనను అత్యంత అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు.
ఈ నేపథ్యంలో, సంబంధిత ఛానల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పుడు లేదా అభ్యంతరకర ప్రసారాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.



