తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నవారు ఎవరైనా పొరపాట్లు చేస్తే తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ఠను కాపాడటం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదం విషయంలో వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, అందుకే ఈ విషయంపై పూర్తి పారదర్శకత అవసరమని అన్నారు.
తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయకూడదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఉపయోగించిన నాలుగు ట్యాంకుల్లో కల్తీ జరిగినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలిపిందని అన్నారు. రిజెక్ట్ అయిన నెయ్యిని మరో పేరుతో తీసుకువచ్చి వాడినట్టు సిట్ దర్యాప్తులో బయటపడిందని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీపై అనవసరంగా అభాండాలు వేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరైంది కాదని అన్నారు. తిరుమల వంటి పవిత్రక్షేత్రం విషయంలో రాజకీయాలు చేయకుండా నిజాలు బయటపెట్టాలని ఆయన కోరారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
