బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ ఎలాంటి మందగమన లక్షణాలు చూపడం లేదు. తాజాగా ఇది 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది.
18వ రోజు నాటికి ఈ చిత్రం రూ.19.7 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, మొత్తం కలెక్షన్లు రూ.598.90 కోట్ల నెట్‌కు చేరాయి. ఈ క్రమంలోనే పుష్ప 2ను వెనక్కి నెట్టిన ధురంధర్, మూడో వారంలో రూ.100 కోట్ల గ్రాస్ దాటిన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. మూడో వారం మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.119.5 కోట్లుగా నమోదయ్యాయి.
ఇంకా విశేషమేమిటంటే… హిందీ బెల్ట్‌లో పుష్ప 2 ఒక పూర్తి వారం సాధించిన వసూళ్లను ధురంధర్ కేవలం నాలుగు రోజుల్లోనే అందుకోవడం. ఇది ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ఉన్న బలమైన ఆదరణను స్పష్టంగా చూపిస్తోంది.
ముందున్న క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కారణంగా ఈ సినిమా మరింతగా వసూళ్లు పెంచుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రణ్వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించడం సినిమాకు మరింత బలంగా మారింది.
