తెలుగు సినిమాకి ఇప్పుడు బాగా మార్కేట్ పెరిగిపోయింది. బాహుబలి సినిమా సాధించిన సంచలనంతో మన సినిమాకి కనీసం పది నుంచి ఇరవై కోట్ల వరకు పెరిగింది. ఇది కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ వరకే. ఇక పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా సత్తా ఎంతనేది అంచనాకి కూడా అందడం లేదు. ఏ సినిమా అయినా కాస్త బాగుంటే, అందులో ఒక సూపర్ స్టార్ వుంటే వంద కోట్ల షేర్ రావాల్సిందే.
సరైనోడు లాంటి సినిమాని ఆ స్థాయిలో చూస్తున్నారంటే ఇక నిజంగా విషయమున్న సినిమాలని ఏ స్థాయిలో ఆదరిస్తారని అనుకోవాలి? ఇలాంటి టైమ్‌ని వాడుకోవడంలో పవన్‌కళ్యాణ్ విఫలమయ్యాడు. ప్రేక్షకుల అభిరుచిని మరీ చీప్‌గా చూసి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ లాంటి సినిమాని తీసాడు.అక్కడికీ దానికి యాభై కోట్ల షేర్ వచ్చింది.
నిజంగా ఈ సినిమా కనుక యావరేజ్‌గా అనిపించినా మరో యాభై కోట్లు ఈజీగా వచ్చి ఉండేవి. ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రానికి వంద కోట్ల షేర్ తక్కువ రాదని అంచనా వేస్తున్నారు. కనీసం తదుపరి చిత్రాన్ని అయినా క్రేజీగా ప్లాన్ చేయకుండా అవుట్‌డేటెడ్ అయిపోయిన ఫ్యాక్షన్ నేపథ్యంలో ఫామ్‌లో లేని ఎస్.జె. సూర్యతో పవన్ చేస్తున్నాడు. ఆ చిత్రం కనీసం యావరేజ్‌గా పాసైపోయినా చాలని పవన్ అభిమానులే భావిస్తున్నారంటే అతనెలాంటి చిత్రాల్ని రెడీ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చునిక.
