నటి వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకురాలిగా పరిచయమైన చిత్రం ‘ఎస్. సరస్వతి’ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనను పొందుతోంది. ఇదే సమయంలో రచయిత సాయి మాధవ్ బుర్ర చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
సాయి మాధవ్ బుర్ర తన ఫేస్‌బుక్ పేజీలో సినిమా పేరు ప్రస్తావించకుండా ఒక పోస్టు చేశారు. ఒక సినిమా తన కథతో ప్రారంభమై, తర్వాత పూర్తిగా మార్చేసారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ కథను రేప్ చేశారు అనే వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు.
ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ వివాదంపై స్పందించారు. సాయి మాధవ్ బుర్రపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె అన్నారు. “నేను ఎవరి కథను దొంగిలించలేదు. ఆ కథకు నేను డబ్బులు చెల్లించాను. ఒకసారి కథ హక్కులు కొనుగోలు చేసిన తర్వాత అది నాదే అవుతుంది. ఆ కథ ఆయన దగ్గర ఆరు సంవత్సరాలుగా ఉంది. నేను కేవలం ఆ కథలోని ప్రాథమిక ఆలోచనను తీసుకుని దాన్ని మరింత అభివృద్ధి చేశాను అని ఆమె వివరించారు.
ప్రేక్షకులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసినట్లు వరలక్ష్మి తెలిపారు. అలాగే సినిమాలో కథకు సాయి మాధవ్ బుర్రకు క్రెడిట్ కూడా ఇచ్చామని చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ, కథా చర్చల్లో సాయి మాధవ్ బుర్ర ఒక్కసారి కూడా పాల్గొనలేదని ఆమె అన్నారు. ఇతర సినిమాల పనులతో ఆయన బిజీగా ఉండటం వల్ల అలా జరిగిందని తెలిపారు.
అయితే రేప్ వంటి సున్నితమైన పదాలు ఉపయోగించడం తనకు బాధ కలిగించిందని వరలక్ష్మి అన్నారు. ముఖ్యంగా సినిమా సున్నితమైన అంశంపై ఉండటంతో అలాంటి వ్యాఖ్యలు తగవని, అవి అనుచితమని ఆమె పేర్కొన్నారు.
