తెలంగాణలో మరోసారి రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ బైపాస్ సమీపంలో జాతీయ రహదారి 65 పై ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్‌సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సుపై నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
