రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటన మరింత విషాదంగా మారింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. చౌడేశ్వరి నగర్‌కు చెందిన సూర్యారావు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో శేషగిరిరావు కూడా కిడ్నీ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 13 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 101 కుటుంబాలపై నిఘా ఉంచి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కల్తీ పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఆ నివేదికలు అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సంఘటన రాజమండ్రి నగరంలో తీవ్ర కలకలం రేపింది. ప్రజలు భయాందోళనకు గురవుతుండగా, పాల సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
