- Advertisement -

ఉరవకొండలో హైటెన్షన్

- Advertisement -

అనంతపురం జిల్లా ఉరవకొండలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆధ్వర్యంలో నేడు భారీ ధర్నాకు పిలుపునివ్వడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. ఈ ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు పట్టణంలో భారీగా బలగాలను మోహరించారు.

విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలో చోటుచేసుకున్న ఓ భూ వివాదం ఈ ఉద్రిక్తతలకు దారితీసింది. వేల్పుమడుగులో వైసీపీ నేత గోవింద్‌కు చెందిన 21 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ప్రైవేటు వ్యక్తిది కాదని, అది ఆలయానికి చెందిన భూమి అని స్థానిక కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే వివాదంలో ఉన్న ఆ 21 ఎకరాలు కచ్చితంగా ప్రైవేటు భూమేనని రెవెన్యూ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) కూడా వైసీపీ నేత గోవింద్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. రెవెన్యూ అధికారుల నివేదిక, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. సదరు భూమి విషయంలో అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులపై తీవ్ర స్థాయికి ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన కనుసన్నల్లోనే అధికారులు హైకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మంత్రి ఇటువంటి కుట్రలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. మంత్రి పయ్యావుల కేశవ్ తీరును నిరసిస్తూ ఉరవకొండలో ధర్నా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉరవకొండలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -